భారత్‌లో 54 శాతం మంది వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడుతున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఒయుపి) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. ‘ది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో వాస్తవాలను ఎలా గుర్తిస్తారు? వాటిని పొందే మారాలను బట్టి ఎలా అంచనా వేస్తారు? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని అంచనా వేశారు.
తప్పుడు సమాచారం, కల్పిత వార్తలకు సంబంధించిన భయాలున్నప్పటికీ ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తాము వెతికే, పంచుకునే సమాచారమే వాస్తవవమైన సమాచారం అని ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యూజర్లు నమ్ముతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నమ్మకం స్థాయి ఎక్కువగా ఉండడం విశేషం.
కాగా వాస్తవ సమాచారం కోసం వెతికేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా 37 శాతం జనం సోషల్ మీడియా వైపు మొగ్గు చూసుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మెక్సికన్లు, దక్షిణాఫ్రికా వాసుల్లో అ శాతం 43గా ఉండగా, భారతీయుల్లో 54 శాతంగా ఉంది. ఈ విషయంలో బ్రిటన్‌లో కేవలం 16 శాతం మంది మాత్రమే సోషల్ మీడియాను తమ అచ్చుమెచ్చిన ప్లాట్‌ఫామ్‌గా భావిస్తున్నారు.
ఇక అమెరికాలో ప్రతి పది మందిలో ఒకరు సోషల్ మీడియానే ఎక్కువగా విశ్వసిస్తున్నారు. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా జనం ఎక్కువగా సమాచారం కోసం గూగుల్ లలాంటి సెర్చ్ ఇంజన్లపైన ఎక్కువగా ఆధారపడుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడయింది.
ప్రసంచవ్యాప్తంగా 67 శాతం మంది ఈ వర్గం వారు ఉండగా, బ్రిటన్‌లో అది 62 శాతంగా ఉంది. అంతేకాదు మూడింట రెండు వంతుల మంది సోషల్ మీడియానుంచి తాము పంచుకునే సమాచారం కచ్చితమైందని బలంగా నమ్ముతున్నారట.ఈ విషయంలో భారత్ ప్రపంచ సగటుకన్నా కాస్త ఎక్కువ స్థాయిలోనే ఉంది. ఇక్కడ 87 శాతం మంది తాము సోషల్ మీడియా ద్వారా పంచుకునే సమాచారమే కచ్చితమైనదిగా నమ్ముతున్నారట.
సోషల్ మీడియా ద్వారా తాము పంచుకునే సమాచారం కచ్చితమైనదని నమ్మే వారిలో వృద్ధులకన్నా యువకులే ముందున్నారు. 25నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారిలో 55 శాతం ఉండగా, 55 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 13శాతమే సోషల్ మీడియా ద్వారా తాము నిజమైన సమాచారాన్ని పంచుకుంటున్నామని నమ్ముతున్నారు. వాస్తవానికి సంబంధించి జనం భావనలో మార్పు రావడంలో కరోనా మహమ్మారి కూడా కీలకపాత్ర సోషించినట్లు ఈ సర్వే ద్వారా వెల్లడయింది.