తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరోనాతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరారు. కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ బులిటెన్ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, కాస్త అలసట, జ్వరంతో బాధపడుతున్నట్లు బులిటెన్లో తెలిపాయి ఆస్పత్రి వర్గాలు.
69 ఏళ్ల వయసున్న ఎంకే స్టాలిన్ కరోనా నిర్ధారణ కావడంతో మంగళవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు ట్విటర్ ద్వారా ఆయన సైతం ప్రకటించారు.
తమిళనాడులో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్, సబ్ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. అయితే ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే నమోదు అవుతున్నాయని, త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించింది.
మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు
కాగా, దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నుంచి నిన్నటివరకూ 20వేలకు దిగువనే నమోదైన కొవిడ్ కేసులు.. దాదాపు 145 రోజుల తర్వాత ఆ మార్క్ ను దాటాయి. గడిచిన 24గంటల్లో 3.94 లక్షల మంది కరోనా పరీక్షలు చేయగా.. 20,139 మందికి పాజిటివ్ గా నిర్థరించారు.
నిన్నటితో పోల్చుకుంటే 3,619 కేసులు పెరిగాయి. దీంతో పాజిటివిటీ రేటు5.1శాతంగా నమోదు కాగా, ఇప్పటి వరకూ 4.36 కోట్ల మంది కొవిడ్ మహమ్మారి బారిన పడ్డట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల కేసులు 1.36లక్షలకు చేరుకోగా.. రికవరీ రేటు 98.5 శాతానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో 16,482మంది కోలుకోగా.. 38 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5.25 లక్షలు దాటింది.