సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన సరికొత్త పథకం అగ్నిపథ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ అడ్వకేట్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శర్మతో పాటు హర్ష్ అజయ్ సింగ్, రవీంద్ర సింగ్ షెకావత్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అయితే పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.
కేరళ, పంజాబ్, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్‌లో ఉన్న పిటిషన్లన్నీంటిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని లేదా ఢిల్లీ హైకోర్టు నిర్ణయం వచ్చేంత వరకు విచారణను నిలిపివేయాలని జస్టిస్ చంద్రచూడ్, సూర్యకాంత్, ఎఎ్ బప్పన్న నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.
అయితే ఈ విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ శర్మపై చమత్కారంతో కూడిన ప్రశంసలు చేశారు.
‘మీరు వీరుడని, కానీ అగ్నివీర్ కాదు’ అంటూ శర్మనుద్దేశించి జోక్ చేశారు. అయితే శర్మ అనేక రకాల సమస్యలపై తరచూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తూ ఉంటారు. దీనిని ఉద్దేశించి ఆయనను వీర్ అంటూ చమత్కరించారు.
అగ్నిపథ్ దరఖాస్తులో ‘కులం’ కాలమ్పై రగడ
మరోవంక, అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థుల కులం, మతం సర్టిఫికెట్లను అడుగుతున్నారని అనేక మంది విపక్షనేతలు, బిజెపి మిత్ర పక్షం మంగళవారం రగడ సృష్టించాయి. అయితే ఇవన్నీ వదంతులే అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ తోసిపుచ్చారు.
ఆర్జేడీ నేత తేజస్వియాదవ్, ఆప్ నేత సంజయ్‌సింగ్ , జేడియు నేత ఉపేంద్ర కుష్వాహా, బిజెపి ఎంపి వరుణ్ గాంధీ తదితరులు కులం ప్రస్తావన తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై అధికార పార్టీ బీజేపీ స్పందిస్తూ ఇవి సైనికులను కించపర్చడం, అవమానించడమేనని ఎదురు దాడి చేసింది.
పార్లమెంట్ ఆవరణలో పాత్రికేయులతో కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ మాట్లాడుతూ పాత విధానం ప్రకారమే అగ్నిపథ్ రిక్రూట్మెంట్ జరుగుతోందని వివరించారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న విధానాన్నే కొనసాగిస్తున్నామని చెప్పారు.
బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ విధానాన్ని సమర్ధించారు. 1947 తరువాత స్పెషల్ ఆర్డర్ రూపొందిందని, అప్పటి నుంచి అదే కొనసాగుతుందని పేర్కొన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో 2013లో సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సంబంధించి ఆర్మీ సమర్పించిన అఫిడవిట్లో రిక్రూట్మెంట్లో కులం, మతం పాత్ర ఏది ఉండబోదని వివరించిందని చెప్పారు.