అర్హులైన ఉద్యోగాలు, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ ప్రికాషన్ డోసులు సమకూర్చేందుకు వీలుగా అన్ని ఉద్యోగ ప్రదేశాలలో కొవిడ్ వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహించాలని కేంద్రం అన్ని శాఖలను ఆదేశించింది.
ప్రికాషన్ డోసుకు అర్హులైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలను కొవిషీల్డ్, కొవ్యాక్సిన్ వారీగా విడివిడిగా రూపొందించాలని అన్ని ప్రభుత్వ శాఖలను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ తన తాజా ఉత్తర్వులో ఆదేశించింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొవిడ్ వ్యాక్సినేషన్ అమృత్ మహోత్సవ్‌ను ప్రారంభించింది. రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్న తేదీ నుంచి ఆరు నెలలు(25 వారాలు) పూర్తి చేసుకున్న అర్హులైన ప్రజలందరికీ ప్రికాషన్ డోసును ఉచితంగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జులై 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు 75 రోజుల్లోపల అన్ని ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని అన్ని శాఖలను కేంద్రం ఆదేశించింది.
కేరళలో మూడో మంకీపాక్స్ కేసు
ఇలా ఉండగా, దేశంలో మూడో మంకీ పాక్స్ వ్యాధి కేరళలో నమోదైంది. మలప్పురం జిల్లాలో 35 ఏళ్ల వ్యక్తికి శుక్రవారం వ్యాధి సోకింది. జూలై 6న అతడు యూఏఈ నుంచి వచ్చాడు. జూలై 13న జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకున్నారు. జూలై 15న అతని శరీరంపై దద్దుర్లు కనిపించాయి.
ప్రస్తుతం అతను జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. అతడితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారినందరిపై నిఘా పెట్టారు. కేరళ రాష్ట్రంలో ఇంతకుముందు రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మొదటిది కొల్లం జిల్లాలో, రెండవది కన్నూర్‌లో. ముగ్గురూ యూఏఈ నుంచి వచ్చినవారే. కన్నూర్‌లోని వ్యాధి సోకిన వ్యక్తి మంగళూరు విమానాశ్రయం ద్వారా వచ్చారు.
టీకాలకు దూరంగా 4 కోట్ల మంది
ఈ ఏడాది జులై 18 నాటికి దాదాపు 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు మొదటి డోసు కరోనా వ్యాక్సినేషన్ కూడా తీసుకోలేదని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. జులై 18వ తేదీ వరకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో 178,38,52,566 వ్యాక్సిన్ డోసులను1 (97.34 శాతం) ఉచితంగా అందచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో తెలిపారు.
జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోసు కూడా తీసుకోలేదని ఆమె తెలిపారు. హెల్త్‌వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 సంవత్సరాలు పైబడిన లబ్ధిదారులు అందరికీ ఈ ఏడాది మార్చి నుంచి ఉచిత ప్రికాషన్ డోసులు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల (సివిసి)లో అందుబాటులో ఉన్నాయని, అదే విధంగా 18-59 వయసు వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రైవేట్ సివిసిలలో అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు.