పాకిస్థాన్ మహిళలు విసిరిన వలపు వల (హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేస్తున్న భారత జవాన్ల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ఇటువంటి ఆరోపణలో మరో జవాన్ శాంతిమే రాణా(24)ను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
పశ్చిమ బెంగాల్‌లోని బగుండా జిల్లా కంచన్పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు.
వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్‌తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్లు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించటం మొదలు పెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు సైతం జమ చేశారని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం డీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు.
2018, మార్చిలో సైన్యంలో చేరిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన ఇద్దరు పాకిస్థానీ మహిళా ఏజెంట్లతో చాలా కాలంగా వాట్సాప్ చాట్, వీడియా, ఆడియో సందేశాలతో మాట్లాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మహిళగా పరిచయం చేసుకుంది గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత.
ఆమె మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నట్లు తెలిపింది. మరో మహిళ నిషాగా కూడామిలిటరీ నర్సింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సైనిక సమాచారం, రహస్య పత్రాల కోసం రాణాను అడిగారు. వారిని నమ్మిన రాణా వాటిని అందించారు. జవాన్ కదలికలపై అనుమానంతో నిఘా వేసిన ఉన్నతాధికారులు పాకిస్థాన్ మహిళలతో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు.