హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో కాల్ గురువారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసిపి నాయకత్వం ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. ఈ వ్యవహారాన్నిముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి విషయంపై ఆరా తీసినట్లు చెబుతున్నారు.
ఎంపీగా ఉన్న మాధవ్ ఓ మహిళతో అసభ్యకరంగా వ్యవహరించినట్లున్న వీడియో కాల్ వైరల్ అయింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ తప్పు తేలితే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది ప్రైవేటు వ్యవహారానికి చెందిన వీడియో అని, వైరల్ అయిందని చెబుతూ ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి (గోరంట్ల మాధవ్) తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తున్నాడని చెప్పారు.
ఈ వీడియో మార్ఫింగ్ చేసినదని గోరంట్ల మాధవ్ చెబుతున్నాడని, ఒకవేళ అది మార్ఫింగ్ చేసిన వీడియో కాదని తేలితే మాత్రం అతడిపై కఠినాతికఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఓ రాజకీయ పార్టీ ఎంతమేరకు చర్య తీసుకోగలదో ఆ స్థాయిలో చర్యలు ఉంటాయని వెల్లడించారు. ఆ చర్యలు అందరికీ గుణపాఠంలా ఉంటాయని తెలిపారు.
ఆ వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేసి ఎవరో పోస్ట్ చేసారని గోరంట్ల మాధవ్ చెప్పుకొస్తున్నప్పటికీ, ఇదే అదును చేసుకొని ప్రతిపక్షపార్టీలు వైస్సార్సీపీ పార్టీ ఫై ..జగన్ ఫై విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో వెనుక పెద్ద కుట్ర ఉందని. దీని వెనుక రాష్ట్ర టిడిపి నేతలు ఉన్నారని మాధవ్ ఆరోపించారు.
ఇప్పటికే ఈ విషయంపై జిల్లా ఎస్పీకి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వీడియోను ఫోరెన్సిక్ టెస్టుకు పంపాలని తాను ఏ విచారణకైనా సిద్ధమేనని చేశారు.. ఈ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారని ఆరోపించారు.
కాగా, గోరంట్ల మాధవ్ అరాచకాలకు అడ్డులేకుండా పోతోందని తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. అరాచకాలను ప్రశ్నించినవారిపైనే అక్రమ కేసులు పెట్టి, బెదిరింపులకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. వైసిపి పాలనలో మహిళలు బయటతిరిగే పరిస్థితి లేకుండా చేశారని అంటూ గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు.