మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో వారాంత కరోనా పాజిటివిటీ రేటు పది శాతానికి పైగా ఉన్నది.
దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ ఏడు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని, కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించాలని తెలిపారు. అలాగే అర్హులకు కరోనా టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
మరోవైపు రానున్న నెలల్లో పలు పండుగలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో జన రద్దీ, సామూహిక కార్యక్రమాలు మరింతగా పెరుగుతాయి. దీంతో కరోనా వైరస్ మరింతగా వ్యాపించే అవకాశమున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆయన అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.
కరోనా కేసులు, మరణాలు పెరుగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేసులు పెరుగుదల విషయంలో ఏ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి, పాజిటివిటీ రేటు ఎలా ఉందనే విషయంపై నిఘా ఉంచి, ఇన్ఫెక్షన్ విస్తరించకుండా క్లస్టర్లు ఏర్పాటు చేయడం, సమర్ధవంతమైన నిర్వహణా చర్యలు చేపట్టడం చేయాలని రాజేష్ భూషణ్ సూచించారు.
ఇన్ఫెక్షన్ త్వరితగతిని విస్తరించకుండా ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. కర్ణాటలో గత నెల రోజులుగా రోజుకు కనీసం 1,355 కొత్త కేసులు నమోదవుతున్నాయని, ఆగస్టు 5న అత్యధికంగా 1,992 కేసులు నమోదయ్యాయని కర్ణాటక ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్) టీకే అనిల్ కుమార్‌కు రాసిన లేఖలో భూషణ్ తెలిపారు.