భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు.
మైక్రోశాట్–2ఏ (ఈఓఎస్శాట్)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్ కంట్రోల్ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్స్టేషన్కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది.
ఎస్ఎస్ఎల్వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్ఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ నింగివైపు ప్రయాణం కొనసాగించింది.
అప్పుడే కురుస్తున్న వర్షపు జల్లులు, దట్టంగా కమ్ముకున్న మేఘాలను చీల్చుకుంటూ తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో సూది పడినా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. శాస్త్రవేత్తలంతా కంప్యూటర్ల వైపు ఉత్కంఠగా చూడడం ప్రారంభించారు. ఇంతలోనే ఏదో అపశుతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు.
రాకెట్లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన మాట్లాడారు. మైక్రోశాట్–2ఏ, ఆజాదీశాట్లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా విచ్చుకున్నాయని చెప్పారు.
అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సర్లు పనిచేయక సిగ్నల్స్ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందకుండా పోయాయని వివరించారు.