29 ఫోన్లను పరీక్షించగా, ఐదు ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్లు గుర్తించామని, అయితే అది పెగాసస్ స్పైవేర్ అని నిర్ధారణకు రాలేకపోతున్నామని ఓ నివేదిక తేల్చినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పెగాసస్ వ్యవహారంపై భారత ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ చెప్పిందని కూడా పేర్కొంది.
పెగాసస్ వ్యవహారంపై రిటైర్డ్ జడ్జి రవీందన్ నేతృత్వంలోని కమిటీని గతంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగా, తాజాగా ఈ రిపోర్టును ఇచ్చింది. దీనిలోని కొన్ని ముఖ్యాంశాలను జస్టిస్ ఎన్వి రమణ గురువారం కోర్టులో వెల్లడించారు.
పెగాసస్ వ్యవహారంలో నివేదికను మూడు భాగాలుగా సమర్పించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. టెక్నికల్ కమిటీ రెండు నివేదికలు, రవీంద్రన్ పర్యవేక్షణ కమిటీ ఓ నివేదిక ఇచ్చినట్లు పేర్కొంది. నివేదికలో ఓ భాగాన్ని తమ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
కాగా, పిటిషనర్లలో కొందరు నివేదికలోని మొదటి రెండు భాగాల కాపీని కోరగా డిమాండ్‌ను కోర్టు పరిశీలిస్తుందని సిజెఐ పేర్కొన్నారు. పూర్తి నివేదికను పరిశీలించకుండా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు.
పూర్తిగా పరిశీలించాకే… తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తానని పేర్కొంటూ, విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేశారు. దేశంలోని పలువురు ప్రముఖుల ఫోన్లపై ఇజ్రాయెల్ చెందిన ఎన్ఎస్ఒ గ్రూపుకు చెందిన పెగాసెస్ స్పైవేర్‌ను కేంద్రం వినియోగించిందని ఆరోపణలు వచ్చాయి.
రాహుల్ గాంధీతో సహా పలువురు రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులున్నారని ఓ వార్తా సంస్థ పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. దీనిపై సమాధానం చెప్పాలని పార్లమెంట్లో కూడా పట్టుబట్టాయి.
అయితే ఈ ఆరోపణలు కేంద్రం తోసిపుచ్చుతూ రాగా, ఈ విషయం సుప్రీం చెంతకు చేరింది. దీనిపై విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.