బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో మూడు రోజుల అడ్డంకుల తర్వాత శుక్రవారం ఉదయం నుండి తిరిగి ప్రారంభమయింది. మంగళవారం రోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చి, అడ్డుకున్న నేపథ్యంలో బండి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, యాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు చివరి సయమంలో అనుమతి నిరాకరించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. వర్ధన్ పేట్ ఎసిపి ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం శనివారం హనుమకొండలో యాత్రను భారీ బహిరంగసభతో ముగింపనున్నారు. ఈ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించనున్నారు.
హైకోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించిన సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకోవడానికి కుట్రలు చేశారని దుయ్యబట్టారు. ప్రజల్లో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసే ప్రజా సంగ్రాయాత్రను అడ్డుకోవడానికి దొంగ కేసులు పెట్టారని మండిపడ్డారు. దాడులు, అక్రమ కేసులతో పాదయాత్రను అడ్డుకోవాలని చూశారని పేర్కొంటూ ప్రభుత్వం ఇకనైనా నికృష్ట ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. అధికారిక కార్యక్రమంలో ప్రధానిపై సీఎం కేసీఆర్ ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తారా? అని ప్రశ్నించారు.
కాగా, ఆగిన చోట నుంచే పాదయాత్రను శుక్రవారం ఉదయం 8 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పామునూర్ నుంచి ప్రారంభించారు. అయితే పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. శనివారం ఉదయం వరంగల్ భద్రకాళి గుడిలో అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకోనున్నారు. సభ జరిగే రోజు మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగించనున్న బండి సంజయ్.. నేరుగా బహిరంగ సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు
రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించి, ఆ నెపాన్ని బీజేపీపైకి నెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని సంజయ్ అరోపించారు. దేశంలోని 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, ఆయా రాష్ట్రాల్లో ఎక్కడా ఘర్షణలు జరగలేదని గుర్తు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే కమెడియన్ మునావర్ ఫారుఖీని హైదరాబాద్ రప్పించారని తెలిపారు.
అభివృద్ధిపై ముఖ్యమంత్రి చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తాము అభివృద్ధి గురించి మాట్లాడితే కేసీఆర్ మతం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్ట్ను మోదీ ఆపారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా ఎడారిగా మారడానికి కేసీఆరే కారణమని ధ్వజమెత్తారు. పంటలు కావాలా?, మంటలు కావాలా? అని కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరి వేస్తే ఉరి అని చెప్పింది కేసీఆర్ కాదా?.. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు? అని ప్రశ్నించారు.