కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు ముందే తెలుసునని, దర్యాప్తు నుండి బయటపడేందుకు కట్టుకథ అల్లుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చార్జీషీట్లో పేర్కొంది.
సుఖేష్‌పై నమోదైన కేసుల గురించి తనకేమీ తెలియదని జాక్వెలిన్ చేస్తోన్న వాదన అబద్ధమని ఇడి చెబుతోంది. సుఖేష్ నేర చరిత్ర గురించి, ఆయన భార్య లీనా గురించి 2021 ఫిబ్రవరిలోనే ఆమెకు తెలుసునని చార్జీషీట్లో పేర్కొంది. జాక్వెలిన్ హెయిర్ స్టైలిస్ షాన్.. సుఖేష్ గురించి అన్ని వివరాలను చెప్పాడని, అన్ని తెలిసే.. అతనితో ఆర్థిక లావాదేవీలను కొనసాగించారని తెలిపింది.
అతడి నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందారని, ఆ ఆదాయమంతా వివిధ నేరాల ద్వారా వచ్చినదేనని పేర్కొంది. రూ. 200 కోట్ల దోపిడీ కేసును దర్యాప్తు చేస్తున్న ఇడి.. గత నెలలో చార్జీషీట్లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును నిందితురాలిగా చేర్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు నోటీసులు పంపింది
నిందితుడి నుండి ఖరీదైన వాచీలు, 20 ఆభరణాలు, 65 జతల బూట్లు, 32 బ్యాగులు, 4హెర్మీస్ బ్యాగులు, తొమ్మిది పెయింటింగ్స్, క్రోకరీ సెట్ వంటి కానుకగా స్వీకరించారని చార్జీషీట్లో ఇడి పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్‌లో జాక్వెలిన్ తల్లిదండ్రులకు సుఖేష్ ఖరీదైన రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడని, ఆమెను ప్రశ్నించే సమయంలో ఈ విషయాలు తెలపలేదని ఇడి తెలిపింది.
సాక్ష్యాధారాలు లభించాకే సుఖేష్ తన కోసం శ్రీలంకలోని వెల్గానాలో ఆస్తిని కొనుగోలు చేసినట్లు జాక్వెలిన్ అంగీకరించినట్లు వెల్లడించింది. మొత్తం అతడి నేర చరిత్ర తెలుసుకుని, ఉద్దేశపూర్వకంగానే సుఖేష్‌తో సన్నిహితంగా మెలిగి.. ఆర్థికంగా లబ్దిపొందారని ఇడి చెబుతోంది.
సుఖేష్ సంబంధించిన డేటాను ఫోన్ నుండి తొలగించమని ఆమె తన సిబ్బందిని కోరినట్లు పేర్కొంది. ఇదంతా చేసి తాను కూడా సుఖేష్ బాధితురాలినేనని కప్పిపుచ్చుకునేందుకు జాక్వెలిన్ ప్రయత్నిస్తున్నారని ఇడి విమర్శించింది.