ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చేసిన విధంగానే బ్యాంక్‌ల విషయంలోనూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ప్రయివేటీకరణకు, సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడాయిల్‌పై విండ్‌పాల్ ట్యాక్స్ పరిశ్రమ వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు.
విండ్‌పాల్ ట్యాక్స్ విధించాలని ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుందని అనడం సరికాదని అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షించాలన్న పరిశ్రమ వర్గాల సూచన మేరకే ముందుకుకెళుతున్నామని ఆమె తెలిపారు. పరిశ్రమ వర్గాలను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకున్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు.
అదనపు పెట్టుబడులు లేకుండానే చమురు సంస్థలకు లభిస్తున్న ఆయాచిత లద్దిపై ఈ సంవత్సరం జులై 1 నుంచి సుంకాన్ని విధించారు. కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నిర్మలాసీతారామన్ చెప్పారు. ప్రభుత్వానికి నిధుల ప్రవాహం అనుకున్న స్థాయిలో ఉండటంలేదని పేర్కొంటూ ప్రస్తుతం ట్యాక్స్-జీడీపీ నిష్పత్తి 10 శాతంగా ఉందని, దీన్ని పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు.
పన్ను పరిధిని విస్తరించడానికి చాలా చర్చలు, విశ్లేషణలు అవసరమని ఆమె తెలిపారు. రాబోయే 25 సంవత్సరాల్లో వందో స్వాతంత్య్ర దినోత్సవం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాల్సి ఉందని, ఇందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు, సుస్థిరాభివృద్ధి సాధించాల్సి ఉందని ఆర్ధిక మంత్రి తెలిపారు.
ఇందుకోసం డిజిటైజేషన్, విద్య, మౌలికసదుపాయాల కల్పన పెరగాల్సి ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. సుస్థిర అభివృద్ధి సాధించేందుకు మరింత అప్రమత్తత, స్థిరమైన ప్రయత్నాలు చేయాల్సి ఉందని చెప్పారు.