చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 46 మంది చనిపోయారని వెల్లడించారు.
సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైందని 16 కిమీ లోతున ప్రకంపన కేంద్రీకృతమైందని చైనా భూకంప నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. లూడింగ్ కౌంటీకి 39 కిమీ దూరంలో భూకంప ప్రకంపన కేంద్రీకృతమైందని, 5 కిమీ పరిధిలో అనేక గ్రామాలు ఉన్నాయని పేర్కొంది. ప్రకంపనల ధాటికి చెంగ్డూలో బిల్డింగ్లు ఊగిపోయాయని చైనా డైలీ తెలిపింది.
దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో బిల్డింగ్లు కూలిపోయాయని, కొండచరియలు విరిగిపడ్డాయని వార్తా సంస్థలు తెలిపాయి. కాగా, 2008లో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 69,000 మందికి పైగా మరణించారు. 2013లో తీవ్రత 7 తో సంభవించిన భూకంపం 200 మందిని బలిగొంది.
మరోవంక కరోనా నిబంధనల ప్రకారం చైనా 33నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధించింది. సుమారు 65 మిలియన్ల ప్రజలు లాక్డౌన్ పరిధిలో ఉన్నారు. రానున్న జాతీయ సెలవు దినాలను పురస్కరించుకుని అంతర్గత ప్రయాణాలపై ఆంక్షలు అమలు చైనీస్ బిజినెస్ మ్యాగజైన్ కైక్సిన్ ఆదివారం కథనాన్ని ప్రచురించింది.
2020లో కరోనా మహమ్మారి తలెత్తినప్పుడు చైనాలోని 103 నగరాల్లో లాక్డౌన్ అమలు చేశారు. చైనాలో ప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య అతి తక్కువగానే ఉన్నా జీరో కరోనా పాలసీ ప్రకారం అధికారులు లాక్డౌన్ అమలు చేస్తున్నారు. చైనా దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,552 కొత్త కేసులు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం నివేదించింది.
కాగా సెప్టెంబర్ 10 నుంచి 12 వరకు సెలవు దినాలు కావడంతో ముందుస్తు జాగ్రత్త చర్యలుగా చైనా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవులను పురస్కరించుకుని ప్రజలు భారీ స్థాయిలో ప్రయాణాలు కొనసాగించకుండా ఆంక్షలు విధించారు.