కరోనా మహమ్మారి సంక్షోభంతో పలు కంపెనీలు తాత్కాలిక ఏర్పాటుగా ప్రారంభించిన వర్క్‌ఫ్రం హోం సదుపాయం ఇప్పుడు శాశ్వతంగా కొనసాగే అవకాశహాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు కేంద్రంలో కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్లు విరుచుకుపడుతుండటంతో ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి.
త్వరలోనే ‘పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం’కు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కొత్త నియమ నిబంధనలను తీసుకు రావచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధానంతో ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు పన్ను భారం కూడా కొంతమేర పెరగవచ్చని భావిస్తున్నారు.
శాశ్వతంగా పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం కోరుకునే వారికి వేతనాలను సవరించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గవచ్చు. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం కింద రీ ఎంబర్స్మెంట్ పెరగవచ్చు కూడా. ఇంటినుంచే పని చేస్తుండటంతో.. విద్యుత్తు, వైఫై, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలు పెరిగే క్రమంలో… వీటిని రీఎంబర్స్‌మెంట్‌లో చేర్చే అవకాశం ఉంటుంది.
ఉద్యోగులు శాశ్వత వర్క్ ఫ్రం హోం కింద మెట్రో నగరాల నుంచి టైర్ 2, టైర్ 3 పట్టణాలకు వెళితే.. దానికి అనుగుణంగా కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, త్వరలోనే కొత్త నిబంధనలను ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు.
శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’ కోరుకున్నపక్షంలో… ఉద్యోగుల వేతన నిర్మాణం మారుతుందని స్పష్టం చేస్తున్నారు. హెచ్ఆర్ఎ, ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. ఉద్యోగులు మెట్రో నగరాల నుంచి నాన్ మెట్రో పట్టణాలకు రాకపోకలు సాగించడంతో హెచ్ఆర్ఎ తగ్గుతుందని, ఆ క్రమంలో… టేక్ హోం (పేయబుల్) వేతనం తగ్గుతుందని చెబుతున్నారు.
హెచ్ఆర్ఎ తగ్గింపు వల్ల పన్ను భారం పెరుగుతుందని పేర్కొంటున్నారు. అలాగే తగ్గిన హెచ్ఆర్ఎ మూలవేతనాలకు జత అయితే అప్పుడు ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే మౌలిక సదుపాయాల వ్యయంను రీఎంబర్స్‌మెంట్‌కు కలిసిన పక్షంలో పన్ను భారం కొంత మేర తగ్గే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు.
శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం అంశంపై ఉద్యోగవర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 80 శాతం మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించగా, 20 శాతం మంది మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అయితే… వర్క్ ఫ్రం హోం తో ఉద్యోగుల సమర్ధతతోపాటు, అటు కంపెనీల ఉత్పాదకత కూడా అనూహ్యంగా పెరుగుతాయని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.
మరోవంక, కార్యాలయాలకు వెళ్ళి పనిచేస్తేనే ‘టీం వర్క్’ ప్రభావముంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగవర్గాల నుంచి కేంద్రం అభిప్రాయాలను సేకరించిందని తెలుస్తోంది. పూర్తిగా వర్క్ ఫ్రం హోం కాకుండా వారానికి మూడు రోజులపాటు వర్క్ ఫ్రం హోం ఉండేలా ఆదేశాలు జారీ కావచ్చని కూడా భావిస్తున్నారు.