బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు, వేల్స్ మాజీ యువరాజు చార్లెస్ ఫిలిప్ అర్థర్ జార్జ్ (చార్లెస్- 3)ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఆక్సెషన్ కౌన్సిల్ ఆయనను బ్రిటన్ రాజుగా ప్రకటించింది.
మొన్నటిదాకా బ్రిటన్ రాణిగా కొనసాగిన ఎలిజబెత్- 2 గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడిగా ఉన్న చార్లెస్- 3ని బ్రిటన్ రాజుగా కౌన్సిల్ ప్రకటించింది. ప్రస్తుతం 73 ఏళ్ల వయసులో ఉన్న చార్లెస్- 3 బ్రిటన్ రాజరిక వ్యవస్థలతో అత్యంత ఎక్కువ వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టిన వారిగా రికార్డులకు ఎక్కారు.
బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆయన వెంట సతీమణి కెమిల్లా, కుమారుడు విలియంలు సహా అతి కొద్ది మంది అతిథులు ఉన్నారు. ఇదిలా ఉంటే, బ్రిటన్ రాజుగా చార్లెస్- 3 పదవీ బాధ్యతలు చేపడుతున్న కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేశారు. ఇలా రాజరిక మార్పు కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయడం ఇదే తొలిసారి.
అంతకుముందు సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, మత పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో మొదట బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణాన్ని అధికారికంగా ప్రకటించిన అనంతరం శాసనకర్తలంతా కొత్త రాజుకు తమ విధేయత తెలిపారు. తర్వాత అధికారికంగా ప్రకటన వెలువరించారు. సంబంధిత పత్రంపై బ్రిటన్ ప్రధాని, కాంటర్బరీ ఆర్చిబిషప్, లార్డ్ ఛాన్స్లర్, పలువురు సీనియర్లు సంతకాలు చేశారు.
ప్రకటన వెంటనే వెలువడినా రాజు పట్టాభిషేకానికి మాత్రం కొన్ని నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. పట్టాభిషేకానికి అనుసరించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణమని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్‌ను 1952 ఫిబ్రవరిలో రాణిగా ప్రకటించగా, పట్టాభిషేకం 1953 జూన్‌లో జరిగింది. 900 ఏళ్లుగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతున్న వెస్ట్‌మినిస్టర్ అబేలోనే ఈసారి ఛార్లెస్ ప్రమాణ స్వీకారం జరగనుంది.