దేశంలో చిన్న కమతాలు కలిగి ఉన్న రైతుల అభ్యున్నతి, అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ అంకుర సంస్థలు పని చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సూచించారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో రైతులు పండించే పంటకు తగిన ధర లభించేలా చూసి, రైతుల ఆదాయం పెరిగేలా చూసేందుకు సహకరించాలని కోరారు.
మేనేజ్-సమున్నతి అవార్డులు 2022ను హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న మేనేజ్ సంస్థలో ఆమె అందజేస్తూ వ్యవసాయరంగంలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానం సాధించేలా చూసేందుకు అవసరమైన వినూత్న ఆవిష్కరణలకు అంకుర సంస్థలు శ్రీకారం చుట్టాలని పిలుపు ఇచ్చారు.
వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నూనె గింజల మిషన్ ను ప్రారంభించిందని, ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వ్యవసాయ అంకుర సంస్థల స్థాపన, ఎఫ్ పీఓల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తున్నదని మంత్రి వివరించారు. వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించి ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణం జరగాలన్న ప్రధానమంత్రి మోదీ ఆశయ సాధనకు వ్యవసాయ అంకుర సంస్థలు తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు.
వ్యవసాయ అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న మేనేజ్ సంస్థను మంత్రి అభినందించారు. సమున్నతి లాంటి సంస్థల సహకారంతో అంకుర సంస్థలను మరింత ప్రోత్సహించేందుకు మేనేజ్ అగ్రి స్టార్ట్ అప్ అకాడమీని నెలకొల్పాలని మంత్రి సలహా ఇచ్చారు. దేశంలో వ్యవసాయ వ్యవస్థాపిత శక్తిని, వ్యవసాయ రంగం కోసం పనిచేసే అంకుర సంస్థలకు సహకారం అందిస్తామని మేనేజ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ చంద్ర శేఖర తెలిపారు.
కాగా,విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ “కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్”లో 15 రోజుల పాటు అంతర్జాతీయ సాంకేతిక, ఆర్థిక సహకార (ఐటిఇసి) శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.15 ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు, మేనేజ్ లో 25 కెడబ్ల్యుపితో హైబ్రిడ్ సోలార్ యూనిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.
