‘ఆంధ్రుల రాజధాని అమరావతే.. ఇది ఐదు కోట్ల ప్రజానీకం అభిమతం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకు అంగీకరించేది లేదు’ అంటూ తిరుపతిలో జరిగిన భారీ బహిరంగసభలో నేతలు స్పష్టం చేశారు. `మాటతప్పను.. మడమతిప్పను’ అన్న జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఒకలా, అధికారం వచ్చాక మరోలా ప్రవర్తించడం సరికాదని ఈ సందర్భంగా హితవు చెప్పారు.
అమరావతి రాజధాని కోసం తమ భూములను ఉచితంగా ఉచ్చిన ఆ ప్రాంత రైతుల త్యాగం వృథాకాదని ఈ బహిరంగ సభలో పాల్గొన్న వివిధ రాజకీయ పక్షాల అధినేతలు భరోసా ఇచ్చారు. అమరావతి పరిరక్షణ సమితి జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి రూరల్ దామినేడు సమీపంలో జెఎసి నేత వెంకటరెడ్డి అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు.
సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ’ పాదయాత్ర చేపట్టిన మహిళలకు, రైతులకు పాదాభివందనం తెలిపారు. అమరావతి ఉద్యమం మొదలైనప్పటి నుంచి 180 మంది చనిపోయారని, వేల సంఖ్యలో కేసులు పెట్టారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాదయాత్రను అడ్డుకునేందుకే 2,500 మందిపైన కేసులు మోపారన్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజధాని అమరావతిలో ఉండాలని ఆందోళన చేసిన దళితులపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత వైసిపి ప్రభుత్వానికే చెల్లిందన్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి రాజధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతు ఉందని, ఇక్కడికి రాకపోయినా సిపిఎం తన మద్దతును తెలియజేసిందని ఆయన చెప్పారు. కొన్ని రాజకీయ విబేధాలు ఉండటం వల్ల రాలేకపోయారని తెలిపారు.
అమరావతి ఉద్యమంపై ఒక సామాజికవర్గ పోరాటమని కుల ముద్ర వేశారని, ఈ నేల మంచిది కాదని ఎన్నో అబద్దాలు చెప్పి ప్రజలు పక్కదారి పట్టే ప్రయత్నం చేశారన్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలని, రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలన్నారని ఆయన స్పష్టం చేశారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. 1952 నుంచి బెజవాడే రాజధాని కావాలని సిపిఐ చెబుతూనే ఉందని, ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా అభివృద్ధి చేయొచ్చని, రాజధానిగా మాత్రం అమరావతే ఉండాలని తేల్చి చెప్పారు. వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా ప్రసంగించారు.
జనసేన రాష్ట్ర నాయకులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తమ అధినేత పవన్‌కల్యాణ్ అప్పటికీ, ఎప్పటికీ రైతుల పక్షానే ఉన్నారని, అమరావతే తమ రాజధాని అని హామీ ఇచ్చారు. బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తమకు సిద్ధాంతపరంగా కొన్ని రాజకీయ పార్టీలతో విబేధాలున్నా అమరావతి కోసం అందరం ఏకమయ్యామని పేర్కొన్నారు.
సినీనటుడు శివాజీ మాట్లాడుతూ.. ఒక్క వైసిపి తప్ప వేదికపైన రాష్ట్ర భవిష్యత్ నిర్ణయించే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని గుర్తు చేశారు. అమరావతి రథాన్ని నడిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు యర్రమనేని శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అమరావతి రైతుల పక్షాన నిలిచిన న్యాయవాది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 13 జిల్లాలున్నా.. అందరి రాజధాని అమరావతే’ అని స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జనసేన రాయలసీమ ఇన్‌ఛార్జి రాందాస్ చౌదరి, బిజెపి ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, టిడిపి మాజీ మంత్రి అమరనాథరెడ్డి, సాధు పరిరక్షణ కమిటీ శివానంద సరస్వతి తదితరులు పాల్గొన్నారు.