వచ్చే ఏడాదిలో మొత్తం ప్రపంచం ఆర్థిక మాంద్యం ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ”పెరుగుతున్న ధరలను కట్టడి చేయడానికి గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో ఏకకాలంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయని.. రేట్ల పెంపుతో రుణాలను మరింత భారంగా మార్చి ధరలను తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ.. ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది’ అని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
ప్రపంచంలోనే మూడు బలమైన ఆర్థిక వ్యవస్థలు అయినా అమెరికా, చైనా, యూరోప్ ల వృద్థి నెమ్మదించిందని తెలిపింది. ప్రపంచ వృద్థి రేటు శరవేగంగా పడిపోతుందని, మున్ముందు మరింత క్షీణిస్తే పలు దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ హెచ్చరించారు.
కరోనా ముందు నాటి స్థాయికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ విధాన నిర్ణయాలు సరిపోవని స్పష్టం చేశారు. కొవిడ్‌కు ముందుతో పోలిస్తే 2023లో ప్రపంచ ద్రవ్యోల్బణం రెట్టింపై ఐదు శాతానికి చేరుతుందని వెల్లడించారు.
ద్రవ్యోల్భణం తగ్గించడానికి వడ్డీ రేట్లు పెంచడం మార్గం కాదని స్పష్టం చేస్తూ సరఫరాలలో అవాంతరాల కారణంగా ద్రవ్యోల్భణం పెరుగుతున్నట్టు గుర్తించాలని హెచ్చరించింది. అందుకనే సరఫరాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని సూచించింది. వడ్డీ రేట్లను పెంచుకొంటూ పోతుంటే వృద్ధి రేట్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది.
వినియోగంను తగ్గించడం నుండి ఉత్పత్తిని పెంచే వైపు దృష్టి సారించాలని ప్రపంచ బ్యాంకు చెప్పింది. లేని పక్షంలో దీర్ఘకాలిక ప్రమాదాలు నెలకొనగలవని హెచ్చరించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నదని చెబుతూ ఏమాత్రం ప్రతికూలత ఏర్పడినా మాంద్యం వైపు దారితీస్తుందని తెలిపింది.