తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్‌ను గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ సతీమణి ఉషాబాయి ఆదివారం కలిసి తన భర్త రాజాసింగ్‌పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకుని తన భర్త జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఉషాబాయ్ ఓ లేఖను అందజేశారు.
ఇక ఉషాబాయి మాట్లాడుతూ హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకుని నిరాధార ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడితో తన భర్తపై అనేకసార్లు కేసులు బుక్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఆరోపించారు. పోలీసులు ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ సర్కారు విధానాలను ప్రశ్నిస్తున్నందుకు.. పోలీసులు రాజాసింగ్ పై తప్పుడు కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే ఆ కేసులపై తాను న్యాయస్థానంలో పోరాడుతున్నానని చెప్పారు.తన భర్తపై చేసిన ఆరోపణలను పోలీసులు నిరూపించలేక పోయారని ఉషాబాయి పేర్కొన్నారు.
తన భర్త రాజాసింగ్ చేసిన చిన్న వ్యాఖ్యలు, ప్రకటనకు కూడా పోలీసులు చాలాసార్లు తప్పుడు కేసులు పెట్టారని పేర్కొంటూ అదే ఇతరులు ఆవిధంగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఉషాబాయి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇదిలా ఉంటే పిడి యాక్ట్ కింద అరెస్ట్ అయిన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే తన భర్తపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ రాజాసింగ్ భార్య న్యాయం చేయాలని కోరుతున్నారు.
రాజాసింగ్ ఆగస్టు 22న విడుదల చేసిన వీడియోలో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌లో నిరసనలు చెలరేగాయి. పోలీసులు మొదట రాజాసింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ రిమాండ్ ప్రక్రియలో లోపాలను పేర్కొంటూ నాంపల్లి కోర్టు అతడ్ని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత రాజాసింగ్‌పై పిడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.