టిఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ చౌరస్తా సభలో మాట్లాడుతూ కేసీఆర్ మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్ కు రావాలని హితవు చెప్పారు. బీజేపీకి అధికారమివ్వండి.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు.
పాదయాత్రలో దారి వెంట ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సంజయ్ ను జవహర్ నగర్, దమ్మాయిగూడా ప్రజలు ప్రధానంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ను తరలించాలని సంజయ్ ని కోరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కెసిఆర్ తనఖా పెట్టాడని సంజయ్ ఆరోపించారు. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు.
రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని టీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరకు ‘మిషన్ భగీరథ’ పేరుతో కూడా పైపులు అమ్ముకుంటున్నారని చెప్పారు
టిఆర్ఎస్ నేతలు భూకబ్జాలతో కోట్లు దండుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ను అభినవ అంబేద్కరని కలెక్టర్ పొగడటమా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించి.. కమీషన్ల కోసం ట్రాక్టర్లను కొనిపిస్తున్నారని, అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు టీఆర్ఎస్ పార్టీ అని బండి సంజయ్ విమర్శించారు.
మేడ్చల్ నియోజకవర్గంలో ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చారని నిలదీసేరు. దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని, దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు.
ఆదివాసీ రాష్ట్రపతి అభ్యర్ధికి ఓటేయని కేసీఆర్ గిరిజనుకు రిజర్వేషన్లు ఇస్తారట అని ఎద్దేవా చేశారు. వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, ఉఫ్ మని ఊదితే కూలిపోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలకు ఈడీ అంటే కరోనా, సీబీఐ అంటే కాలు విరుగుతోందని ఎద్దేవా చేశారు.