క్రిప్టో కరెన్సీలపై పూర్తిస్థాయి నిషేధం విధించాల్సిందేనని ఆర్బీఐ తేల్చి చెప్పినట్లు తెలుస్తున్నది. వాటిపై పాక్షిక ఆంక్షలు ఫలితాలివ్వబోవని బ్యాంకు బోర్డు సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం.
క్రిప్టో కరెన్సీల విలువ, క్రిప్టో ఎక్స్చేంజ్ల యాజమాన్య నిర్వహణతోపాటు సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య సుస్థిరత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని ఆర్బీఐ అభిప్రాయ పడింది. క్రిప్టోలపై ఆర్బీఐ వైఖరినే బ్యాంక్ సెంట్రల్ బోర్డు సమర్థించినట్లు తెలుస్తోంది.
విదేశాల్లో పుట్టిన ఊహాజనిత ఆస్తుల నియంత్రించడం కష్ట సాధ్యం అనే అభిప్రాయం వ్యక్తమైంది. విదేశీస్టాక్ ఎక్స్చేంజీల్లో క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ జరుగుతుందని సమావేశంలో పాల్గొన్న ఓ సభ్యుడు అన్నట్లు సమాచారం. 2018లో క్రిప్టో కరెన్సీలను ఆర్బీఐ నిషేధించినా.. గతేడాది సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే.
కొందరు సభ్యులు బ్యాలెన్స్డ్ విధానాన్ని అనుసరించాలని కోరినట్లు సమాచారం. టెక్నాలజీ స్పేస్ విస్తరించడంతోపాటు ఆర్థిక రంగంపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎటువంటి వైఖరిని వెల్లడించలేదని సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ-2021 బిల్లుపైనా ఆర్బీఐ బోర్డు సమావశంలో చర్చకు వచ్చింది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం తలపోస్తున్నది.