అర్థంపర్థంలేని ఎన్నికల హామీలు ఇచ్చే ఇచ్చే రాజకీయ పార్టీలకు ఎన్నికల కమీషన్ ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో హామీలు చేసే రాజకీయ పార్టీలు వాటికి నిధులు ఎలా సమకూరుస్తాయో కూడా తెలియజేయాలన్న ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనతో ఓటర్లకు హామీలు ఇచ్చే పార్టీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని తెలిపింది.
అక్టోబర్ 19లోగా ఈ ప్రతిపాదనపై స్పందించాలని, మార్పులు సూచించాల్సిందిగా ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలకు రాసిన లేఖలో పేర్కొంది. ఏ వాగ్దానాల అమలు సాధ్యమవుతుందో అవే ఓటర్ల విశ్వాసం పొందాలని తాము భావిస్తున్నామని ఆలేఖలో పేర్కొంది.
మానిఫెస్టోలను రూపొందించడం రాజకీయ పార్టీల హక్కు అనే వాదనతో తాము ఏకీభవిస్తున్నప్పటికీ.. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యవహరించడం అత్యవసరమని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని ప్రశ్నించింది. దీనిపై తమకు కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరింది. అలాగే పార్టీలకు ఉన్న ఆర్థిక వనరులేంటి ? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ? అనేది కూడా చెప్పాలని నిర్దేశించింది. ఈ అంశాలపై ఈనెల 19 లోగా సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలకు సూచించింది.
ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను విడుదల చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత హామీలను ‘టైమ్ బాంబులు’గా అభివర్ణించింది. ‘ఉచిత’ పథకాల ఖర్చు పరిమితిని సుప్రీంకోర్టు ప్యానెల్ ద్వారా నియంత్రించాల్సిందిగా సూచించింది. రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ పథకాల ఖర్చు ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో 1 శాతం లేదా పన్ను ఆదాయంలో 1 శాతాన్ని మించకుండా చూడాలని అభిప్రాయపడింది.
ఎస్బీఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్.. వివిధ రాష్ట్రాలు అందిస్తున్న ఉచితాలపై ఈ నివేదికను రూపొందించారు. కొన్ని రాష్ట్రాల్లో పార్టీలు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణను కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని నివేదికలో ప్రస్తావించారు.