అంతరిక్ష వినియోగంలో సుస్థిరతను సాధించే దిశగా భారతదేశం అగ్రగామిలో దూసుకు పోతోందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో ‘వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్-2022’ను గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరుపుకోవడం వెనుక అంతరిక్ష సాంకేతికత, దాని స్పష్టమైన ప్రయోజనాలను సామాన్య ప్రజలు, విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యం ఉందని వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష శిథిలాలను పర్యవేక్షించడానికి ‘ప్రాజెక్ట్ ఎన్ఇటిఆర్ఎ’ను ప్రారంభించినట్లు చెప్పారు.
ఇది అంతరిక్ష ఆస్తులను రక్షించడం, తదుపరి ప్రణాళికకు సహాయపడుతుందని తెలిపారు. విపత్తు నిర్వహణ, వాతావరణ అంచనా, మత్స్యకారులకు సముద్ర నావిగేషన్, ఓషనోగ్రఫీ, టెలిమెడిసిన్, టౌన్ ప్లానింగ్, కమ్యూనికేషన్, డిటిహెచ్, మొబైల్ కనెక్టివిటీ మొదలైన అనేక ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ప్రశంసనీయమైన సేవలందించడం హర్షణీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీహరికోట డైరెక్టర్ ఎ.రాజరాజన్, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు రత్నాకర్, కె.చక్రవర్తి, కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్ ఛాన్సలర్ సంజీవి, ఎంపి గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.