ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని అందజేస్తారు. ఈ ఏడాది కూడా నోబెల్ శాంతిని బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ లను 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేశారు.
ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది.
ఈ ఏడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారని వివరించింది.
అలెస్తో పాటు ఈ సంస్థలు బెలారస్, రష్యా, ఉక్రెయిన్లలో మానవహక్కులు, ప్రజాస్వామ్యం, శాంతికి కృషి చేశాయని నోబెల్ కమిటీ పేర్కొంది. 1980వ సంవత్సరం మధ్యలో బెలారస్లో ఉద్భవించిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో అలెస్ ఒకరు. సంస్థ వ్యవస్థాపకుడు వియాస్నా (స్ప్రింగ్) తన స్వదేశంలో ప్రజాస్వామ్యం, శాంతికి కృషి చేశారు. అయితే అలెస్ బైలియాట్స్కి గొంతును అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం యత్నిస్తూనే ఉంది. 2020లో విచారణ లేకుండానే ఆయనను అదుపులోకి తీసుకుంది.
రష్యా, ఉక్రెయిన్, బెలారస్లో రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం దిశగా వెళుతున్న సమయంలో ఈ మూడు సంస్థలు యుద్ధ నేరాలు, మానవ హక్కులు, అధికార దుర్వినియోగం జరగకుండా అడ్డుకున్నాయని, ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం కోసం కృషి చేశాయని కమిటీ తెలిపింది.