భారత వైమానిక దళం రైజింగ్ డే సందర్భంగా శనివారం చండీగఢ్‌లో వైమానిక ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా వైమానిక దళ సిబ్బంది ఆకాశంలో చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సులో చేపట్టిన ఎయిర్ షో చూసేందుకు వేలాదిగా స్థానికులు తరలివచ్చారు. రెండున్నర గంటల పాటు ఎయిర్ షో కొనసాగింది. ఈ ప్రదర్శనలో రాఫెల్, సుఖోయ్, మిగ్, ప్రచండ, మిరాజ్, చేతక్, చిరుత, చినూక్, రుద్ర వంటి 80కి పైగా విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి.
వైమానిక దళానికి చెందిన శిక్షణ పొందిన జవాన్లు పారాచూట్ ద్వారా వేల అడుగుల ఎత్తులో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎయిర్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి కొత్త యూనిట్‌ను ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా వైమానిక దళానికి కొత్త కార్యాచరణ శాఖ.. వెపన్ సిస్టమ్ బ్రాంచ్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.
అలాగే, వైమానిక దళం కోసం సిద్ధం చేసిన యూనిఫాంను కూడా ప్రారంభించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫాం ప్రత్యేకత. ఈ యూనిఫాంను ఎయిర్‌ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్తంగా తయారుచేశాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రైజింగ్ డే తొలిసారి ఢిల్లీ ఆవల చండీగఢ్‌లో నిర్వహించారు.
యూనిఫాం డిజిటల్ నమూనా ఎడారి, పర్వత భూమి, అడవి వంటి ప్రదేశాల్లో సైనికులు తమ విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యూనిఫాంను తేలికపాటి ఫాబ్రిక్, డిజైన్‌తో తయారు చేశారు. కొత్త కంబాట్ యూనిఫామ్‌లో కంబాట్ టీ-షర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్రప్టివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్ట్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్లెట్ కంబాట్ బూట్లు, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.
అగ్నిపథ్ పథకం ద్వారా రిక్రూట్ అయిన అగ్నివీర్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేర్చుకోనున్నట్టు మార్షల్ వివేక్ రామ్ చౌదరి చెప్పారు. వారి తొలి శిక్షణ కోసం ఈ ఏడాది డిసెంబర్లో 3000 మంది అగ్నివీరులను తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి మహిళా అగ్నివీరుల రిక్రూట్మెంట్పై కూడా ఐఎఎఫ్ యోచిస్తోందని, మౌలిక సదుపాయాల కల్పన పురోగతిలో ఉందని చౌదరి చెప్పారు.
