ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరమైన ‘ఆర్థిక మాంద్యం’ ముప్పు అంచుల్లో చిక్కుకుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ హెచ్చరించారు. మాంద్యం వల్ల దెబ్బతినే పేదలకు మద్దతుగా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లతో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ సంయుక్త సమావేశం సందర్భంగా డేవిడ్ మాల్పాస్ మీడియాతో మాట్లాడారు.
‘2023లో ప్రపంచ వృద్ధి రేటు మూడు శాతం నుంచి 1.9 శాతానికి తగ్గించాం. అది ప్రమాదకరమైన ప్రపంచ ఆర్థిక మాంద్యానికి చేరువలో ఉంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మాంద్యం సంభవిస్తుంది’ అని డేవిడ్ మాల్పాస్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ద్రవ్యోల్బణం సమస్యతో వడ్డీరేట్లు పెంచడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు పెట్టుబడులు తగ్గుతాయని హెచ్చరించారు. అదే జరిగితే పేదల పరిస్థితులు దెబ్బ తింటాయని తెలిపారు. పేదలను ఆదుకోవడమే ప్రపంచ బ్యాంకుకు పెద్ద సవాల్ అని స్పష్టం చేశారు.
‘అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలకు సాయం చేయడంపైనే మేం దృష్టి సారించాం. ఇప్పటికైతే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఆయా దేశాల్లో పరిస్థితులు విభిన్నం. కొన్ని దేశాల్లో పరిస్థితులపైనే మేం చర్చించాం. అన్ని దేశాలకు ఈ అంశం వర్తింపజేయడం లేదు’ అని డేవిడ్ మాల్పాస్ తెలిపారు.
కొన్ని దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచాయని చెబుతూ ఆయా దేశాల్లో పరిస్థితుల గురించి తాము చర్చించామని పేర్కొంటూ కొన్ని దేశాలు ఒక సబ్సిడీ ఇస్తే, మరికొన్ని మరో తరహా రాయితీలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
‘ద్రవ్య విధానాలు విభిన్నం. కొన్ని దేశాలు కమొడిటీ ఉత్పత్తిదారులు మరికొన్ని దేశాలు కమొడిటీ కొనుగోలుదారులన్న అంశం చాలా ముఖ్యమైంది. సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలను కోరాం. పేదలను కాపాడేందుకు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి’ అని డేవిడ్ మాల్పాస్ చెప్పారు.
కరెన్సీలు బలహీన పడటంతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వడ్డీ రేట్లు పెంచడం వల్ల రుణ భారం పెరిగిపోతుందని తెలిపారు. కరెన్సీ మారకం విలువ పతనం కూడా రుణ భారం పెరుగుదలకు కారణమని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఐదో దశ రుణ భారాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పారు.