విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ లో నిర్వహించిన విశాఖ గర్జనకు వైస్సార్సీపీ నేతలు, కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రులు, నేతలు తిరిగి వెళుతున్న సమయంలో వారి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రులు జోగి రమేశ్, రోజా కార్ల అద్దాలను జనసైనికులు ధ్వంసం చేశారు. కార్లపై పిడిగుద్దులతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని దాడితో మంత్రులు, నేతలు షాక్ కు గురయ్యారు. రోజా కారుపై జనసేన మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసిరారు.
జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. తమ అధినేతకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టు వద్దకు పెద్దఎత్తున జనసేన శ్రేణులు చేరుకున్నాయి. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమానికి మద్దతు తెలిపిన అనంతరం కార్యక్రమాన్ని ముగించుకుని మంత్రి రోజా, జోగి రమేష్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లలో ఎయిర్పోర్టుకు వెళ్తున్నారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రావటంతో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా వైస్సార్సీపీ నేతల కాన్వాయ్ల మీద దాడికి తెగబడ్డారు. పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ కర్రలు, రాళ్లతో దాడి నిర్వహించారు. ఈ క్రమంలో నేతల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
అయితే, సుబ్బారెడ్డి, మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారని వస్తున్న వార్తలను జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఖండించారు. విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అసలు మంత్రుల కార్ల మీద దాడి జరిగినట్లుగానీ, అది జనసేన వాళ్ళు చేసినట్లుగానీ పోలీస్ శాఖ నిర్ధారించలేదని గుర్తు చేశారు.
కేవలం వైస్సార్సీపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు మాత్రమే ఇదని చెబుతూ దాడి సంస్కృతిని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని స్పష్టం చేశారు. ఆ విద్యలో వైస్సార్సీపీ వాళ్ళు ఆరితేరిపోయారని ఎద్దేవా చేశారు విశాఖ విమానాశ్రయంలోనే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కోడి కత్తి హడావిడి చేశారని గుర్తు చేశారు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరూ తేల్చలేదని చెప్పారు.
అదే పంథాలో ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ఒక పవిత్ర పదవిలో ఉన్న పెద్దాయన మీద దాడి జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని అంటూ నిజంగా మంత్రుల మీదే దాడి జరిగితే వాళ్ళకు రక్షణగా ఉన్న పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని మనోహర్ ప్రశ్నించారు. అలా జరిగితే అది కచ్చితంగా పోలీసు శాఖ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటనకు భారీ జన సందోహం వచ్చిందని పేర్కొంటూ మరుసటి రోజు జరిగే జనవాణి కార్యక్రమం నుంచి ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మళ్లించేందుకే వైస్సార్సీపీ కొత్త నాటకానికి తెర తీసిందని ఆయన ఆరోపించారు. విశాఖవాసులకు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు ఏమిటో తెలుసు? మంత్రుల కాకమ్మ కథలను ఎవరూ నమ్మే పరిస్థితి లేరని స్పష్టం చేశారు.