ఆత్మనిర్భర్ ఢిల్లీని బీజేపీ కోరుకుంటోందని, అడ్వర్టైజ్మెంట్లతో అభివృద్ధి సాధ్యమనే అభిప్రాయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్షా ధ్వజమెత్తారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ నిర్భర్ కావాలో, ఆత్మనిర్భర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
దక్షిణ ఢిల్లీలోని తెహ్కండ్ ప్రాంతంలో వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ను అమిత్షా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేజ్రీవాల్ ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపించిందని, మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.40,000 కోట్ల బకాయి పడిందని చెప్పారు.
ఆప్ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లపై భారీగా ఖర్చు చేసిందని, అడ్వర్టైజ్మెంట్లతో అభివృద్ధి సాధించగలమనే అభిప్రాయంతో ఆప్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కానీ ఇలాంటి భ్రమలన్నీ కేవలం ఐదు నుంచి ఏడేళ్ల పాటు మాత్రమే ఉంటాయని చెప్పారు. అడ్వర్టైజ్మెంట్ల ప్రభుత్వం కావాలో, అభివృద్ధి రాజకీయాలు కావాలో ప్రజలు ఎంచుకోవాలని సూచించారు.
ఎంసీడీ పరిధిలో వార్డుల మార్పులకు చేపట్టిన డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తికావడంతో తుది ముసాయిదాకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఎంసీడీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగగమైంది.