ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అడ్వైజరీ బోర్డ్ షాకిచ్చింది. రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. తనపై పెట్టిన పీడీ యాక్టును ఎత్తేయాలని రాజాసింగ్ కమిటికి విజ్ఞప్తి చేశారు. విచారించిన కమిటీ ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.
రాజాసింగ్ బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టులో ఆయన భార్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 28న హైకోర్టులో విచారణ జరుగనుంది. పీడీ యాక్ట్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. గతంలో రాజాసింగ్‌పై పీడీయాక్ట్ ఎత్తివేసే అంశంపై అడ్వైజరీ బోర్డు సమావేశమైంది.
తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని బోర్డు కు రాజాసింగ్ తెలిపారు. ఒక రాజకీయ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నందున కక్షతో పీడీ యాక్ట్ నమోదు చేసారని ఆరోపించారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని తెలిపారు.
గతంలో అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను బోర్డు ముందుంచారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు పీడీ యాక్టును కక్షపూరితంగా ప్రయోగించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది.
అడ్వైజరీ బోర్డు చైర్మెన్ భాస్కరరావు, మరో ఇద్దరు జడ్జిల సమక్షంలో విచారణ జరిగింది. ఈ సమావేశంలో రాజాసింగ్ భార్యతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ, మంగళ్ హాట్, షాహినాయత్ గంజ్ పోలీసులు పాల్గొన్నారు. రాజాసింగ్‌ను చర్లపల్లి జైలు నుంచి వీడియో కాన్ఫరెస్ప్ ద్వారా విచారించారు.
ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆగస్టు 22వ తేదీన సోషల్ మీడియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజాసింగ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.