కేంద్ర జలశక్తితో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా కృష్ణా జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణం నిలుపుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ ఎంబీ)కు లేఖ రాశారు.
చట్టవిరుద్ధంగా కృష్ణా జలాలను తరలించేందుకు ప్రాజెక్టులు నిర్మించటంతో పాటు కొత్త పనులకు టెండర్లు పిలుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ తాము ఇప్పటికి 40 లేఖలు రాసినా కృష్ణా బోర్డు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు.
గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్దం పెంపు ద్వారా కృష్ణా జలాలను బేసిన్ అవతలకు ఏపీ తరలిస్తోందని లేఖలో ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్దం పెంపుదల వల్ల కృష్ణాలో తెలంగాణ వాటాగా దక్కిన జలాలను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందనీ, జల విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో నీటి నిల్వలు కూడా కరువవుతాయని లేఖలో వివరించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తో పాటు బంకర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ కు శ్రీశైలం నుంచి 80 క్యూసెక్కులు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం 2014 అంతర రాష్ట్ర జలవివాద చట్టాన్ని తుంగలో తొక్కుతోందని ఆరోపించారు.
బ్రజేష్ కుమార్ టైబ్యునల్ (కృష్ణా నదీ జలవివాద పరిష్కారాల ట్రిబ్యునల్ కెడబ్ల్యుడీటీ-2)లో విచారణలు కొనసాగుతున్నా, తుది తీర్పులు రాకపోయినా ఏపీ లక్ష్య పెట్టటం లేదని తెలిపారు. ఏపీలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా బోర్డు ఇకనైనా మేల్కొని అవసరమైన చట్టబద్ద చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.
ఏపిలో జరుగుతున్న ఈ పనుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులపైనే కాకుండా, అన్గోయింగ్ ప్రాజెక్టులపై కూడా వాటి ప్రభావం పడుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టాలను కూడా ఏపి ఉల్లంఘిస్తోందన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఒప్పందాలను పాటించటం లేదన్నారు. వీటిపై వెంటనేతగు చర్యలు తీసుకోవాని కోరారు.
గతంలో గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సులజ స్రంవంతి పథకాల విస్తరణ పనులు ,ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు , ఎస్ఆర్ఎంసి విస్తరణ పనులు , తెలుగు గంగ పధకం ప్రధాన కాలువ వెంట మిని ఎత్తిపోతల పథకాలు ,కుందూ నది విస్తరణ పనులను వివిరిస్తూ లేఖల ద్వారా ఇదివరకే బోర్డు దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఇప్పటికైనా బోర్డు స్పందించి ఏపిలో అక్రమంగా జరుగుతున్న ప్రాజెక్టుల పనులు నిలిపివేయించాలని కోరూతూ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు బోర్డు చైర్మన్కు లేఖ రాశారు.