మునుగోడు ఉపఎన్నికల సమయంలో తమ ఎమ్యెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ బేరసారాలు చేస్తున్నట్లు అధికార టిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున రేపిన దుమారం చల్లారిపోయింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించడమే కాకుండా, వారిని వెంటనే విడుదల చేయమని గత అర్ధరాత్రి ఆదేశించారు.
నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు నిబంధనలు అనుసరించలేదని స్పష్టం చేయడమే కాకుండా, ఈ కేసును అవినీతి నిరోధక చట్టం పరిధిలో నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వజూపినట్లుగా ఎలాంటి నగదు లభ్యం కాకపోవడంతో పీసీ యాక్ట్ కేసుల కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు.
నిందితుల అరెస్ట్ విషయంలోనూ 41 సీఆర్పీసీ నిబంధనలు పాటించలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విచారించిన తరువాత తమ ముందు ప్రవేశపెట్టాలని గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.
అంతకుముందు పార్టీ మారేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, నిందితులు రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజి స్వామిపై నేరపూరిత కుట్ర 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్171-బి, 506 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ మేరకు నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్‌ను జడ్జి తిరస్కరించడం తెలంగాణ ప్రభుత్వంకు భంగపాటుగా మారింది. ఆ సమయంలో అక్కడ ఎటువంటి నగదు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లేకపోవడం, కేవలం రాజకీయ పరమైన సమాలోచనలు జరగడంతో అరెస్ట్ చేయడం పట్ల జడ్జి విస్మయం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో సైబరాబాద్ పోలీసులు బుధవారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్రెడ్డిలతోపాటు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి స్వామిజీలను పోలీసులు గుర్తించారు.
డీల్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని సీపీ రవీంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్స్‌ను పరిశీలించారు. ఆడియో, వీడియో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పద చాటింగ్స్, ఫోన్ నంబర్స్‌ను సేకరించారు. ఫామ్‌హౌస్‌లోని పని చేసే వాళ్ల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. శంషాబాద్ రూరల్ పీఎస్‌లో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. లంచంగా ఇస్తామన్న డబ్బుకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు.