భారత దేశంలో ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని కామన్వెల్త్ దేశాలకు అందించడానికి భారత దేశం ముందుకు వచ్చింది. ఈ పరిణామం పట్ల సెక్రటరీ జనరల్ పట్రిషియా స్కాట్లాండ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది గొప్ప పరివర్తన తీసుకొచ్చే చర్య అని ప్రశంసించారు.
56 దేశాలకు సభ్యత్వం గల కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఈ నెల 12న ఈ ప్రతిపాదనను భారత్ చేసిన్నట్లు ఆయన వెల్లడించారు. పట్రిషియా స్కాట్లాండ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇది గొప్ప దాతృత్వమని కొనియాడారు. తన టెక్నాలజీని ఇతర దేశాలతో పంచుకోవడానికి ఇష్టపడటం వల్ల భారత్ ఇతర దేశాలకు భిన్నమైనదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
భారత దేశం చాలా విశిష్టమైనదని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. టెక్నాలజీని ఇతర దేశాలకు ఇవ్వడానికి ఇష్టపడటం చాలా గొప్ప విషయమని తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుందని ఆయన చెప్పారు. ఇటువంటి విశాల హృదయం, అరమరికలు లేని వ్యవహారశైలి, దాతృత్వం స్వాగతించదగినవని తెలిపారు.
భారత దేశం సాధించిన నవ కల్పన వల్ల చాలా సభ్య దేశాలకు ఆశలు చిగురించాయని ఆయన చెప్పారు. భారత దేశం కొత్త చిట్కాలను అభివృద్ధిపరచడం మాత్రమే కాకుండా, వాటిని ప్రజా శ్రేయస్సు కోసం ఇతర దేశాలకు అందజేయడానికి ముందుకు రావడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. ఇది గొప్ప మార్పును తీసుకురాగలిగే అంశమని చెప్పారు. ఇతర దేశాలు ఆర్తిగా ఎదురు చూస్తున్న ఈ అభివృద్ధిని భారత దేశం చూసిందని, పరీక్షించిందని, అంతేకాకుండా ఆ దేశాలకు దానిని ఇవ్వడానికి ఇష్టపడుతోందని తెలిపారు.
ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాలోకి డిజిటల్ మాధ్యమం ద్వారా డబ్బును తక్షణం పంపించేందుకు అవకాశం కల్పించే టెక్నాలజీయే యూపీఐ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబరులో మన దేశంలో రూ.11 లక్షల కోట్లకుపైగా యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగాయి. నగదు రహిత లావాదేవీలు ప్రతి నెలా పెరుగుతుండటం విశేషం.