ఫామ్‌హౌస్ ఫైల్స్‌లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అసాధారణ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి మంత్రిస్థాయి భద్రత కల్పించారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 4+4 గన్మెన్లు ఇస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నివాసంతో పాటు, సొంతూళ్లలోనూ భద్రత ఇవ్వనున్నారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాదు, దాదాపు గంటన్నరపాటు సాగిన బేరసారాలను రహస్యంగా ఆడియో, వీడియో రికార్డింగ్ కూడా చేశారు. వారి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోందిగానీ, పోలీసులు ఆ విషయాన్ని నిర్ధారించలేదు.
దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు.
పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, మధ్యవర్తుల మధ్య సంభాషణల ఆడియో, వీడియోలను టీఆర్ఎస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.