బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను 40 రోజులుగా పీడీ చట్టం కింద జైలుపాలు చేసిన తెలంగాణ ప్రభుత్వంకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. సుదీర్ఘ విచారణ అనంతరం కేసీఆర్ ప్రభుత్వం ప్రయోగించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది.
వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజాసింగ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పాటు, ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టు కేసు ఎత్తివేయడంతో….చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది.
మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టకూడదని రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని నిర్దేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ చేయకూడదని తెలిపింది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటి నుంచి.. అంటే దాదాపు రెండు నెలలుగా రాజాసింగ్ జైల్లోనే ఉంటున్నారు.
రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తేసే అంశంపై రాబోయే రెండు, మూడు రోజుల్లో బీజేపీ హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ నోటీసు కు రాజాసింగ్ ఇచ్చిన సమాధానం పట్ల క్రమశిక్షణ సంఘం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
