టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ తో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ మరో అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే ప్రపంచ చాంపియన్లుగా ఉంటూనే టీ20 చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తొలి జట్టుగా అవతరించింది.
ఇంగ్లండ్ ఇప్పటికే 2019 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని మరోమారు విశ్వవిజేతగా అవతరించింది.
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను ఇంగ్లండ్ 137/8 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 138 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలుత తడబడినా ఆ తర్వాత కుదురుకుని విజయాన్ని అందుకుంది.
19 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించిన ఇంగ్లండ్ సగర్వంగా రెండో టీ20 ప్రపంచకప్ ట్రోపీని అందుకుంది. అంతేకాదు, రెండు టీ20 ప్రపంచకప్‌లతో వెస్టిండీస్ సరసన చేరింది. 2010లో పాల్ కాలింగ్‌వుడ్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు టీ20 ప్రపంచకప్ అందుకుంది. 2016 ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే, విండీస్ బ్యాటర్ కార్లస్ బ్రాత్‌వైట్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
ప్రత్యర్థి పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేధించారు. టార్గెట్ స్వల్పమే అయినా మ్యాచ్‌ను నిలబెట్టుకునేందుకు పాకిస్తాన్ బౌలర్లు విశ్వప్రయత్నం చేశారు. కానీ కీలక సమయాల్లో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లాండ్ గెలుపు ఖాయమైంది.
ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్.. అందులోనూ ఛేజింగ్‌లో ఒత్తిడి తట్టుకుని ఇంగ్లండ్‌ను విజయ తీరాలకు చేర్చాడు. 49 బంతుల్లో 52 పరుగులు కొట్టి చివరి వరకూ క్రీజులో నిలబడ్డాడు. నాలుగు ఓవర్లు వేసి 3 వికెట్లు కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చినా సామ్ కర్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.
పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మ్యాచ్ ఒక దశలో పాక్ రేసులోకి వచ్చినట్టు కనిపించింది. కానీ కీలక సమయంలో వికెట్లు పడకపోవడంతో ఇంగ్లండ్‌దే పైచేయి అయ్యింది. షాషీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్ తలో వికెట్ తీయగా.. హారిస్ రౌఫ్ 2 వికెట్లు తీశారు.
