చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్లు ముఖాముఖీ సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జి-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇరువురు నేతలు సోమవారం నేరుగా కలుసుకున్నారు. హోటల్ ములియాలో బాల్రూమ్ ఈ అరుదైన భేటీకి వేదికయింది.
అక్కడ ఏర్పాటు చేసిన చైనా, అమెరికా పతాకాల ఎదుట ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయిన తరువాత ఇరువురు నేరుగా కలవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు వీడియో, ఫోన్ కాల్స్ ద్వారా వీరిద్దరి మధ్య సంభాషణలు సాగాయి. కరచాలనం అనంతరం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశమైనారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా కృషి జరగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఎదురయ్యాయని జిన్పింగ్ పేర్కొన్నారు. వీటి నుండి గుణపాఠాల నేర్చుకుని భవిష్యత్వైపు దృష్టి సారించాలని చెప్పారు.
ఇటువంటి సమావేశాలు తరచు నిర్వహించడం ద్వారా ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కలిసి పనిచేయడానికి వీలవుతుందని బైడెన్ తెలిపారు. ఈ భేటీలో ఇరు దేశాల అధ్యక్షులతో పాటు, విదేశాంగ మంత్రులు, రాయబారులు కూడా పాల్గొన్నారు.
బాలికి చేరుకున్న ప్రధాని మోదీ
కాగా, జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా రాజధాని బాలిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానికి ఇండోనేషియా ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. ఆ దేశ సంప్రాదాయం ప్రకారం మోదీని స్వాగతించింది. జీ20 సదస్సులో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రపంచ నేతలతో ప్రధాని సమావేశమవుతారు.
జీ20 సదస్సు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తో పాటు 20 దేశాల, యూరోపియన్ యూనియన్లకు చెందిన అధిపతులు ఈ సదస్సులో పాల్గొంటారు. కరోనా, ఆర్థిక పునరుద్ధరణ, రష్యా-ఉక్రెయన్ యుద్ధం, ఐరోపా సంక్షోభం, ఇంధన భద్రత, ఆహార భద్రత సవాళ్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వంటి అనేక అంశాలపై జీ20 దేశాలు రెండు రోజుల చర్చిస్తాయి.
వచ్చే ఏడాది జీ20 సదస్సు భారత్ లోని కశ్మీర్లో జరగనుంది. ఇందులో భాగంగా జీ-20 నిర్వహణ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరిస్తుంది. ఇండోనేషియా అధ్యక్షుడి నుంచి ప్రధాని మోడీ జీ 20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. సదస్సు ముగింపు వేళ ఈ ప్రక్రియ జరుగనుంది.