ప్రతి ఏడాది బ్రిటన్‌లో పని చేయడానికి భారత్ నుండి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చినట్లు బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. బాలిలో జరుగుతున్న జి20 సమావేశంలో భారత్ ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని రిషిసునాక్ సమావేశమయ్యారు. వారిద్దరు కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం.
భారత సంతతికి చెందిన మొదటి వ్యక్తి రిషి సునాక్ గత సెప్టెంబర్ లో బ్రిటీష్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే వారి మొదటి సమావేశం కావడం గమనార్హం. గతేడాది అంగీకరించిన యుకె -ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుండి ఇటువంటి లబ్థి పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
యుకె – ఇండియా యంగ్ ప్రొఫెనల్స్ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు బ్రిటన్‌కి వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్లు యుకె ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్లో పేర్కొంది. జి 20 సమావేశంలో యుకె- భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్లు ప్రధాని మోడీ కార్యాలయం ట్విటర్లో పేర్కొంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి బ్రిటన్ విస్తృత నిబద్ధతకు, ఈ పథకం ప్రారంభమని బ్రిటన్ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో అన్ని దేశాల కన్నా బ్రిటన్‌కు భారత్‌తో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని తెలిపింది.
బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారతదేశానికి చెందినవారు. బ్రిటన్‌లో భారతీయ సంతతికి చెందిన వారి పెట్టుబడుల వల్ల దాదాపు 95 వేల ఉద్యోగాలు లభిస్తున్నాయి. బ్రిటన్ ప్రస్తుతం భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు ఆమోదించినట్లయితే.. ఇది భారతదేశం ఒక యూరోపియన్ దేశంతో చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది. వాణిజ్య ఒప్పందం ఇప్పటికే 24 బిలియన్ పౌండ్ల విలువైన బ్రిటన్ -భారత్ వాణిజ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
అలాగే భారత్ అందించిన అవకాశాలను బ్రిటన్ చేజిక్కించుకోవడానికి వీలు కల్పిస్తుంది. భారత్‌తో మొబిలిటీ భాగస్వామ్యానికి సమాంతరంగా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం తెలిపింది.