భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాశ్వంగా పిలువడే పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు సర్వం సిద్దంచేశారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ లోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే రాకెట్ అనుసంధాన ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు.
పీఎస్ఎల్వీ -సీ54 వాహకనౌక నాలుగు దశలను సిద్దం చేసి శిఖరభాగాన పేలోడ్‌లో ఓషన్‌శాట్ -3తో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అమర్చారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 26న 11.56గంటలకు పీఎస్ఎల్వీ -సీ54 రాకెట్ నింగిలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఓషన్ శాట్ భూ పరిశీలన ఉపగ్రహం సముద్ర పరిశీలన లక్ష్యంగా సేవలు అందించనుంది. ఈ ఉపగ్రహాన్ని ఐదేళ్లపాటు సేవలు అందించే విధంగా రూపొందించారు. సముద్ర ఉపరితల పరిశీలన కోసం ఈ ఉపగ్రహాన్ని ఉపయోగపడనుంది.
అదేవిధంగా భూటాన్‌శాట్, ధృవస్పేస్కు చెందిన థైబోల్ట్ -1, థైబోల్ట్ -2, ఆస్ట్రోకాస్ట్ నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహాలను రాకెట్ శిఖర భాగాన అమర్చి రాకెట్‌కు తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు.రిహార్సల్ నిర్వహించిన అనంతరం ఫ్రీకౌంట్డౌన్, కౌండ్‌డౌన్ ప్రక్రియను చేపట్టనున్నారు. కౌంట్‌డౌన్ సమయంలో రాకెట్‌లోని నాలుగుదశలలో ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ రాకెట్ ద్వారా ని ర్థేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఇస్రో ఉత్సాహంగా అడుగులు వేస్తోంది.