అంతర్జాతీయ అంశాల ప్రభావం వల్లే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని సాధించలేక పోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య విధాన కమిటీ తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతుండటం వల్ల ఇంధనం, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాల ధరలు పెరిగాయని, కరోనా మహమ్మారి వల్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయని పేర్కొంది.
ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాల్లో ఇవి కొన్ని అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ ఓ లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, అత్యంత గోప్యంగా రాసిన ఈ లేఖలో భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరాలు లేవు.
వరుసగా మూడు త్రైమాసికాల్లో వినియోగదారుల ద్రవ్యోల్బణం 2 శాతం నుంచి 6 శాతం బ్యాండ్‌లో అప్పర్ రేంజ్‌ను తాకింది. ఈ నేపథ్యంలో ఈ లేఖను కేంద్రానికి ఆర్బీఐ ఎంపీసీ పంపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ ఈ లేఖను రాసింది.
ఈ సమాచారాన్ని వెల్లడించవలసిన అవసరం ప్రభుత్వానికి లేదు. అయితే ధరలకు కళ్లెం వేయలేకపోవడానికి కారణాలను ఆర్బీఐ వివరించాలని చట్టం చెప్తోంది. ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం ప్రస్తుతం 6.8 శాతం ఉంది, ఇది ఓ ఏడాదిలో 5 శాతానికి తగ్గవచ్చు.