బ్రిటన్‌కు పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి మరో షాక్ తగిలింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.11,000 కోట్ల మేర మోసగించిన కేసులో భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను లండన్ హైకోర్టు తిరస్కరించింది.
లండన్‌లోని రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ మేరకు గురువారం తీర్పు ఇచ్చింది. ‘సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతి కోరుతూ అప్పీల్దారుడు నీరవ్ మోదీ దాఖలు చేసిన దరఖాస్తు తిరస్కరిస్తున్నాం’ అని జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అలాగే కోర్టు ఖర్చుల కింద 1,52,247 పౌండ్లు (సుమారు రూ.1.5 కోట్లు) చెల్లించాలని నీరవ్ మోదీని ఆదేశించింది. కాగా, బ్రిటన్‌లో అరెస్టైన 51 ఏళ్ల నీరవ్ మోదీ 2019 మార్చి నుంచి లండన్ జైల్లో ఉంటున్నాడు. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందంటూ లండన్ హైకోర్టును ఆశ్రయించాడు.
అయితే ఆయన వాదనలతో ఏకీభవించని లండన్ హైకోర్టు ధర్మాసనం ఆ పిటిషన్‌ను ఇటీవల తిరస్కరించింది. ఈ నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నీరవ్ మోదీ భావించాడు. అయితే దీని కోసం చేసిన దరఖాస్తును కూడా లండన్ హైకోర్టు తిరస్కరించింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత చట్టం కిందకు ఇది రాదని స్పష్టం చేసింది.