రాజోలుకు చెందిన వైసీపీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో ఆదివారం చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బొంతు రాజేశ్వరరావు రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గత రెండు ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
బొంతు రాజేశ్వరరావు జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన వైసీపీకి రాజీనామా చేయగా.. జనసేనలో చేరుతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. తన అనుచరుల సలహాలు, జనసేన నేతల నుంచి ఆహ్వానం రావడంతో.. ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బొంతు రాజేశ్వరరావుతో విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన కండువా కప్పుకున్నారు.
వైసీపీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని, పార్టీ కోసం కష్టపడిన వారిని జైలుకు పంపుతున్నారని ఈ సందర్భంగా రాజేశ్వరరావు విమర్శించారు. దళిత యువకుడిని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చిందని, కానీ జగన్ అభిమాని కొడికత్తి శ్రీనుకు మాత్రం ఇప్పటివరకు బెయిల్ రాలేదని విమర్శించారు.
కొడికత్తి శ్రీను ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నాడని, అతడికి న్యాయం చేయడానికి కూడా వైసీపీ ముందుకు రావడం లేదని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ ఈ మూడున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం బాగా నష్టపోయిందని విమర్శించారు.
దళితులపై దాడులు పెరిగిపోయాయని బొంతు రాజేశ్వరరావు ఆరోపణలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని, అది నచ్చే జనసేనలో చేరినట్లు స్పష్టం చేశారు. జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని, రాజోలులో జనసేన గెలుపు కోసం కష్టపడతానని బొంతు రాజేశ్వరరావు తెలిపారు.