పాకిస్థాన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ని తాలిబన్లు నిర్బంధించారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కౌంటర్ టెర్రరిజమ్ డిపార్ట్మెంట్ (సిటిడి)పై దాడి చేశారు. ఆ కేంద్రంలో ఉన్న 9 మంది భద్రతా సిబ్బందిని నిర్బంధించారు.
గతంలో అరెస్ట్ చేసిన కొందరు తాలిబన్ ఉగ్రవాదుల్లో ఒకరిని ఆదివారం సిటిడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అతడు ఒక అధికారి నుండి ఎకె-47ని లాక్కుని అధికారులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందారు. ఇతర ఉగ్రవాదుల్ని కూడా విడిపించి, ఆ కేంద్రాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆ తాలిబన్ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు. సిటిడి తమ నియంత్రణలో ఉందని, 9 మంది సిబ్బందిని సైతం తాము బంధించామని ఆ వీడియోలో పేర్కొన్నారు. వాళ్లను విడిచిపెట్టాలంటే, తాము ఆఫ్ఘనిస్తాన్ చేరేందుకు ఒక హెలికాప్టర్ సిద్ధం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి గురించి సమాచారం అందుకున్న వెంటనే.. పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి.. తాలిబన్ల చెర నుంచి అధికారుల్ని విడిపించేందుకు ప్రయత్నిస్తోంది.
ఆదివారం నుంచి ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఇంతవరకూ బయట నుంచి ఎలాంటి ఫైరింగ్ జరపలేదని బన్ను డిపిఒ మొహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. తాము మొత్తం కంటోన్మెంట్ని చుట్టముట్టామని, బన్ను జిల్లాలో ఇంటర్నెట్ను కూడా నిలిపివేశామని పేర్కొన్నారు. ప్రావిన్స్ మాజీ ముఖ్యమంత్రి అక్రమ్ ఖాన్, ప్రావిన్స్ సిట్టింగ్ మంత్రి మాలిక్ షా మహమ్మద్ ఉగ్రవాదులతో చర్చలు జరిపేందుకు బన్నూకి చేరుకున్నారని తెలిపారు.