టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కందుకూరు పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన చంద్రబాబు సభకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సుమారు పది మంది కార్యకర్తలు ఒక్కసారిగా పెద్ద కాలువలో పడిపోయారు.
తొక్కిసలాటలో గుండంకట్ట ఔట్లెట్లో కార్యకర్తలు జారిపడిపోయారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నాకే ప్రసంగం చేస్తానంటూ కార్యక్రమాన్ని నిలిపేసి చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
కాగా తొక్కసలాటలో కార్యకర్తల మరణం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.కాగా, ఈ ఘటనలో గాయపడిన వారిని చంద్రబాబు కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించినట్టు తెలుస్తోంది.ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడబోనని చెబుతూ చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. వారి పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గురువారం టీడీపీ నేతలు, కార్యకర్తలంతా కలిసి చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటారని తెలిపారు. అదే సమయంలో వారికి తక్షణ సాయం కూడా అందిస్తామని తెలిపారు. రోడ్ షో ప్రాంగణంలోనే చనిపోయిన వారికి సంతాప సూచికంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన చంద్రబాబు.. అనంతరం కందుకూరు నుంచి బయలుదేరి వెళ్లారు.
ఈ దుర్ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే మృతి చెందిన వారి ఒక్కొక్క కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రధాని ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ప్రకటించారు.
కందుకూరులో తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందడం, మరి కొందరు ఆసుపత్రి పాలవడం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.