గుంటూరు జిల్లాలో మరో దురదృష్ట సంఘటన చోటుచేసుకుంది. గుంటూరు వికాస్నగర్లో టీడీపీ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. ఈసభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది.
చంద్రబాబు ప్రసంగించి వెళ్లిన తర్వాత చంద్రన్న కానుకలు పంపిణి కార్యక్రమం చేపట్టారు పార్టీ శ్రేణులు. అదే సమయంలో మహిళలు కానుకలు తీసుకునేందుకు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈసంఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వాళ్లను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ తొక్కిసలాటలో మొత్తం ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రన్న కానుక కార్యక్రమాన్ని అస్తవ్యస్తంగా నిర్వహించడం వల్లే ఈ అపశృతికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రవాసాంధ్రుడు ఈ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు వారం రోజులుగా పని చేస్తున్నారు.
ఇందుకోసం పెద్దయెత్తున ప్రచార కార్యక్రమం కూడా చేపట్టారు. వికాస్ నగర్లో ఏర్పాటు చేసిన ఈ సభకు సుమారు 30 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేసినా.. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవటమే ఈ తొక్కిసలాటకు కారణమైందని తెలుస్తోంది. కేవలం రెండు నుంచి మూడు వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బారికేడ్లు కూడా నామమాత్రంగా ఏర్పాటు చేసినట్టు కనబడుతోంది.
తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అదే సమయంలో క్షతగాత్రులకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశించారు. ఇటీవల కందుకూరులో జరిగిన టీడీపీ రోడ్ షోలోనూ తొక్కిసలాట జరిగింది. నాటి ఘటనలో 8 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు.
