ఈ నెల 15న సికింద్రాబాద్–విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి దీన్ని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు.
వాస్తవానికి ఈ రైలు ప్రారంభంకు ఈ నెల19న ప్రధాని మోదీ జరపవలసిన సికింద్రాబాద్ పర్యటన వాయిదా నేపథ్యంలో నాలుగు రోజుల ముందుగానే తెలుగువారికి ముఖ్యమైన సంక్రాంత్రి పండుగ సమయంలో ఈ రైలును అందిస్తున్నారు.
చెన్నై నుంచి వచ్చిన వందేభారత్ విశాఖ – సికింద్రాబాద్ మధ్య ట్రెయిల్ రన్ పూర్తి చేసారు. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ఇప్పటికే పలు రైళ్లు నడుపుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటం తో ఉదయం వేళ ఈ రైలును నడపాలని నిర్ణయించారు. మిగిలిన రైళ్ల కంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకొనే అవకాశం కలుగుతుంది.
ఈ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే నడవనుంది. రైలు షెడ్యూల్ ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు నడవనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే నిలుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి రాజమండ్రి 7.55/7.57కు, విజయవాడ 10/10.05, ఖమ్మం 11/11.01, వరంగల్‌కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్ 14.15 గంటలకు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 15.00గంటలకు బయలుదేరి వరంగల్ సాయంత్రం 16.35/16.36 గంటలకు, ఖమ్మం 17.45/17.46, విజయవాడ 19.00/19.05, రాజమండ్రి 20.58/21.00, విశాఖపట్నం రాత్రి 23.30 గంటలకు చేరుతుంది.
ఇప్పటి వరకు విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇతర రైళ్ల కంటే త్వరగా గమ్య స్థానాలకు చేరుకుంటుంది. గరీబ్‌రధ్ ఎక్స్‌ప్రెస్ 11.10 గంటలు, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్‌ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.
దురంతో రైలు 10.10 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వందేభారత్ ఇతర రైళ్లతో పోలిస్తే దాదాపు మూడు గంటల సమయం ఆదా చేస్తుంది. రైలు గంటకు 180కి.మీ వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8.40 గంటల్లో కవర్ చేస్తుంది.