ప్రముఖ సోషల్ షేరింగ్ యాప్ షేర్‌చాట్ తన ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఆర్థిక మాంద్యం, ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరులోని మాతృ సంస్థ మొహల్లా టెక్ తెలిపింది. షేర్చాట్తోపాటు షార్ట్ వీడియో యాప్ మోజ్ కూడా 500 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం షేర్‌చాట్ సంస్థలో 2,200 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. అందులో 20 శాతం అంటే దాదాపు 600 మందిని తొలగించనుంది. కంపెనీ చరిత్రలో అత్యంత బాధాకరమైన, కష్టమైన నిర్ణయాలను తీసుకోవలసివచ్చందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ప్రారంభం నుండి మాతో పాటు ఉన్న ప్రతిభావంతులైన ఉద్యోగుల్లో సుమారు 20 శాతం మందిని తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్ వరకు వంద శాతం వేరియబుల్ పేని చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నోటీసు పీరియడ్ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లించనున్నారు. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాలా చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు తెలిపింది. 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా సదుపాయం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. వాడుకోని సెలవులను గరిష్ఠంగా 45 రోజుల వరకు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చని సూచించింది.
గత డిసెంబర్‌లోని రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 ఆర్థికసంవత్సరంలో రూ.80.4 కోట్ల నుండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 4.3 రెట్లు పెరిగి రూ. 419.2 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ తెలిపింది. షేర్‌చాట్ యాప్ ప్రకటనల ద్వారానే అధిక ఆదాయం చేరుతోందని.. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం పెరిగిందని పేర్కొంది.
అయితే సంస్థ మొత్తం ఖర్చులు 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.1,557.5 కోట్ల నుండి సుమారు 119 శాతం పెరిగి రూ. 3,407.5 కోట్లకు చేరాయి. మార్కెటింగ్, ఉద్యోగుల ప్రయోజనాలు, ఐటి ఖర్చులు పెరగడంతో ఖర్చు భారీగా పెరిగిందని సంస్థ పేర్కొంది. గత డిసెంబర్లో ఇదే కంపెనీ జీత్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను మూసేసింది. అందులో 115 మంది ఉద్యోగులపై వేటు వేసింది. నెల రోజులు తిరగకముందే షేర్ చాట్‌లో 20 శాతం మందిని తొలగించడం గమనార్హం.