ప్రపంచ కప్ దిశగా భారత్ ప్రయాణం అద్భుతంగా సాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా తమ లక్ష్యం ఒకటే అన్న రీతిలో టీమ్ఇండియా విజృంభిస్తున్నది. ఇప్పటికే శ్రీలంకను మట్టికరిపించిన భారత్ వన్డే నంబర్‌వన్ టీమ్ న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నది. హైదరాబాద్ వన్డేలో ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకున్న రోహిత్‌సేన, రాయ్‌పూర్‌లో కివీస్‌ను రఫ్ఫాడించింది.
శనివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో(179 బంతులు మిగిలుండగానే) ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సొంతగడ్డపై భారత్‌కు ఇది వరుసగా ఏడో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం.
తొలుత షమీ(3/18), హార్దిక్(2/16), సుందర్(2/7) ధాటికి కివీస్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 20.1 ఓవర్లలో 111/2 స్కోరు చేసింది. షమీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.
పాకిస్థాన్‌పై సిరీస్ విజయంతో భారత్ గడ్డపై అడుగుపెట్టిన న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పరుగుల వరద పారిన హైదరాబాద్ వన్డేలో గెలుపు వాకిట బొక్కాబోర్లా పడిన న్యూజిలాండ్ రాయ్‌పూర్‌లో దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది.
పచ్చిక పిచ్‌పై పేస్ దళం షమీ, సిరాజ్, హార్దిక్, శార్దుల్ విజృంభణతో కివీస్ చిగురుటాకులా వణికింది. వీరి స్వింగ్ ధాటికి కివీస్ బ్యాటింగ్..సైకిల్ స్టాండ్‌ను తలపించింది. తొలి పది ఓవర్లలోనే సగం మంది బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఫిలిప్స్(36), సాంట్నర్(27), బ్రేస్‌వెల్(22) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఒకానొక దశలో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనుకున్న కివీస్..వీరి బ్యాటింగ్‌తో పరువు కాపాడుకుంది.
స్వల్ప లక్ష్యఛేదనను టీమ్ఇండియా ఆడుతూ పాడుతూ అందుకుంది. కెప్టెన్ రోహిత్‌శర్మ(51) అర్ధసెంచరీతో కదంతొక్కగా, డబుల్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్(40 నాటౌట్), ఇషాన్ కిషన్(8 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశారు. షిప్లె, సాంట్నర్ ఒక్కో వికెట్ తీశారు.
సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్: 34.3 ఓవర్లలో 108 ఆలౌట్(ఫిలిప్స్ 36, సాంట్నర్ 27, షమీ 3/18, హార్దిక్ 2/16), భారత్: 20.1 ఓవర్లలో 111/2 (రోహిత్ 51, గిల్ 40 నాటౌట్, సాంట్నర్ 1/28, షిప్లె 1/29)