పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత కేజ్రీవాల్ కు సోమవారం సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి కింద కోర్టులో విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ వీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది.
ఇది 2018 నాటి కేసు. అప్పుడు ఆప్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ , బీజేపీ ఆదేశాలతో వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మంది ఓటర్ల పేర్లను ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేత రాజీవ్ బబ్బర్ తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆతిశీ, కేజ్రీవాల్‌కు 2019లో ట్రయల్ కోర్టు నోటీసులు ఇచ్చింది. వాటికి వ్యతిరేకంగా ఆప్ నేతలు సెషన్స్ కోర్టును , హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలుసుకునే హక్కు ఉందని, ఈ తరహా అసత్య ప్రచారాలను అనుమతించరాదంటూ పరువునష్టం కేసును కొట్టివేయడానికి నిరాకరించింది.
దాంతో వారు సుప్రీంను ఆశ్రయించగా విచారణపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తమ స్పందన తెలియజేయాలని ఢిల్లీ పోలీసులను, రాజీవ్ బబ్బర్‌ను ఆదేశించింది.