జమ్ములో పేలుళ్ల అనంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహల్‌గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర ఆదివారం పున: ప్రారంభమైంది. ఉదయం ఏడుగంటలకు జమ్ము డివిజన్లోని కతువా జిల్లా హీరానగర్ నుండి ప్రారంభమైన యాత్ర నెమ్మదిగా కొనసాగుతోంది.
జమ్ముకాశ్మీర్ పార్టీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని, వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లాలతో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలతో యాత్రలో పాల్గొన్నారు. శనివారం పేలుళ్లతో యాత్రకు విరామం ప్రకటించారు.
ఉదయం 8 గంటలకు యాత్ర సాంబ జిల్లాలోకి చేరుకుంది. రహదారికి ఇరువైపులా వేచి ఉన్న కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు రాహుల్‌కు స్వాగతం పలికారు. సుమారు 25 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చక్ నానక్ వద్ద యాత్రకు విరామం ఇవ్వగా, సోమవారం ఉదయం తిరిగి యాత్రను ప్రారంభించారు.
అయితే ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతా దళాలు జమ్ము – పఠాన్‌కోట్ హైవేను మూసివేశారు. శాంతియుతంగా మార్చ్‌ను నిర్వహించేందుకు పోలీసులు, సిఆర్పిఎఫ్, ఇతర భద్రతా దళాలు తగిన భధ్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
శనివారం జమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్లలో తొమ్మిది మంది గాయపడడంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. సమీప గ్యారేజీలో నిలిపివుంచిన ఎస్యువి, ఆ పక్కనే ట్రాన్స్పోర్ట్ నగర్లో ఆపిన మరో వాహనాల్లో అమర్చిన ఎల్ఇడిలు ఈ పేలుళ్లకు కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటాక జమ్ములోని బజల్తా వద్ద జరిగిన మూడో పేలుడులో ఓ పోలీసు గాయపడినట్లు అధికారులు తెలిపారు.