మార్చి 28, 29 తేదిల్లో జీ-20 సదస్సు నిర్వహణకు విశాఖపట్నం ముస్తాబవుతున్నది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు గ్రేటర్ అధికారులకు సహకరించాలని గ్రేటర్ కమిషనర్ పి. రాజాబాబు కోరారు.
ఎంతో ప్రతిష్టాత్మాకంగా నిర్వహించనున్న సదస్సుకు 40 దేశాల నుంచి 200 వరకూ ప్రతినిధులు హాజరవుతారని, వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతి, ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
దీనిలో భాగంగానే స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ నగరాన్ని సుందరీకరించడం, విద్యుత్ దీపాల ఏర్పాటు, ప్లాంటేషన్, పౌంటైన్ల ఏర్పాటు ప్రత్యేకంగా చేపడుతున్నామని తెలిపారు. సదస్సుకు విచ్చేసే ప్రతినిధులకు పర్యాటక ప్రాంతాలను సైతం సందర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్కేబీచ్ తో పాటు, రుషికొండ, తొట్లకొండ, శిల్పారామం ప్రాంతాలను సైతం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
అయితే జీ-20 సదస్సు కంటే ముందుగా మార్చి2, 3 తేదిల్లో విశాఖలోనే ఇన్విస్టర్స్ మీట్ జరగనున్న నేపధ్యంలో అనాటికే జీ-20 ఏర్పాట్లు పూర్తిచేసేలా ప్రణాళిక ప్రకారం పనులు ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా నగర సుందరీకరణతో పాటు, రహదారులు, ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా ఆర్కేబీచ్ ప్రాంతాన్ని ఓ ఐకానిక్ గా తీర్చిదిద్దేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.